అలాగే సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలు, పుకార్లను నమ్మవద్దని, అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని సూచించారు.

తిరుపతి జిల్లా చిట్వేలు మండలం భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టబడుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ 2026 కార్యక్రమంపై చిట్వేల్ మండల ప్రజలకు తహసీల్దార్ శ్రీ ఎస్.వి. నరసింహారావు గారు పలు ముఖ్య సూచనలు చేశారు.
తహసీల్దార్ గారు మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ అనేది ఓటర్ల జాబితాను ఖచ్చితంగా, పారదర్శకంగా మరియు తాజాగాగా ఉంచేందుకు భారత ఎన్నికల సంఘం చేపట్టే సాధారణ ఎన్నికల ప్రక్రియ అని తెలిపారు.

అర్హత కలిగిన ఏ ఓటరు పేరును కూడా యాదృచ్ఛికంగా తొలగించరని, ఎన్నికల సంఘం నిర్దేశించిన విధివిధానాలను పూర్తిగా అనుసరించిన తర్వాత మాత్రమే ఓటర్ల జాబితాలో మార్పులు లేదా సవరణలు చేపడతారని స్పష్టం చేశారు.
అర్హత కలిగిన ప్రతి భారత పౌరుడికి ఓటరుగా నమోదు అయ్యే హక్కు ఉందని, అవసరమైన వివరాలు సమర్పించిన ప్రతి అర్హుడికి ఓటరు జాబితాలో నమోదు చేసుకునే అవకాశం కల్పించబడుతుందని తెలిపారు.
ఎస్‌ఐఆర్ కార్యక్రమాలపై ప్రజలు ఎటువంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, ఈ కార్యక్రమం నిజమైన ఓటర్లకు ఇబ్బందులు కల్పించడం కోసం కాదని, ఎన్నికల వ్యవస్థను మరింత పటిష్టంగా, పారదర్శకంగా రూపొందించడమే దీని ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు.
మండలంలోని బూత్ లెవల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటరు వివరాలను ధృవీకరిస్తూ, అవసరమైన సహాయాన్ని అందిస్తున్నారని తెలిపారు. ఓటరు పేరు జాబితాలో లేకపోయినా, వివరాల్లో ఏవైనా తప్పులు ఉన్నా, సంబంధిత దరఖాస్తులను బూత్ లెవల్ ఆఫీసర్ ద్వారా సమర్పించి నమోదు లేదా సవరణ చేసుకునే అవకాశం ఉందన్నారు.

2002 మ్యాపింగ్ గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలపై స్పందిస్తూ, 2002 మ్యాపింగ్ పూర్తికాకపోతే ఓటు తొలగిపోతుందనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. 2002 మ్యాపింగ్ అనేది కేవలం ఓటరు వివరాల ధృవీకరణ ప్రక్రియ మాత్రమేనని, అది ఎవరి ఓటు హక్కును స్వయంచాలకంగా రద్దు చేసే ప్రక్రియ కాదని తెలిపారు. 2002 మ్యాపింగ్ జరగకపోయినంత మాత్రాన ఎవరి పేరు కూడా వెంటనే ఓటర్ల జాబితా నుండి తొలగించబడదని వివరించారు.
ప్రతి అర్హత కలిగిన ఓటరికి తన వివరాలను సమర్పించుకునే, అవసరమైన పత్రాలను అందించే పూర్తి అవకాశం కల్పించబడుతుందని, ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం సమగ్ర విచారణ, ధృవీకరణ అనంతరమే ఏవైనా నిర్ణయాలు తీసుకోబడతాయని పేర్కొన్నారు.
రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, బూత్ లెవల్ ఏజెంట్లు మరియు ప్రజలందరూ ఎన్నికల అధికారులకు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అలాగే సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలు, పుకార్లను నమ్మవద్దని, అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని సూచించారు.

ప్రజలకు ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత బూత్ లెవల్ ఆఫీసర్ లేదా తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించి సరైన సమాచారాన్ని పొందాలని కోరారు.
ప్రతి అర్హత కలిగిన ఓటు అమూల్యమైనదని, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, విశ్వసనీయ ఎన్నికల నిర్వహణకు ఖచ్చితమైన ఓటర్ల జాబితా ఎంతో అవసరమని, ఎస్‌ఐఆర్–2026 కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తహసీల్దార్ శ్రీ ఎస్.వి. నరసింహారావుగారు విజ్ఞప్తి చేశారు