కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి దారుణానికి పాల్పడిన నిందితుడు.. నగదు, మొబైల్ దోచుకుని పరార్

హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్–పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో ఉన్న మహిళను ఆస్పత్రికి తీసుకెళ్తానని నమ్మించిన ఓ ఆటో డ్రైవర్, ఆమెకు ఇచ్చిన కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి తాగించాడు. పానీయం తాగిన కొద్దిసేపటికే మహిళ స్పృహ కోల్పోవడంతో, ఆటోను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

అంతేకాకుండా, స్పృహలో లేని మహిళ వద్ద ఉన్న మొబైల్ ఫోన్, నగదును దోచుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. కొంతసేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన బాధితురాలు జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులను ఆశ్రయించింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడైన ఆటో డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్‌కు పంపింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.