హైదరాబాద్: సల్కం చెరువు ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవెల్) ఆక్రమణలకు సంబంధించిన కేసులో తెలంగాణ హైకోర్టు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థ భవనం ఎఫ్‌టీఎల్ పరిధిలో లేదని ప్రభుత్వం నివేదిక సమర్పించినప్పటికీ, మ్యాపులను పరిశీలించిన న్యాయస్థానం పలు కీలక ప్రశ్నలు సంధించింది.
"మ్యాప్స్ చూస్తే ఆక్రమణ స్పష్టంగా కనిపిస్తోంది కదా? గతంలో ఉన్న ఎఫ్‌టీఎల్ పరిమితి ఇప్పుడు ఎలా తగ్గింది?" అంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అలాగే, "తమకు నచ్చిన వారి నిర్మాణాలను కూల్చకుండా వదిలేస్తున్నారా?" అంటూ ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
చెరువుల పరిరక్షణలో హైడ్రా చేపడుతున్న చర్యలపై కూడా వివరణ ఇవ్వాలని ఆదేశించిన కోర్టు, మున్సిపల్ శాఖ, హెచ్‌ఎండీఏ ఇప్పటివరకు నివేదికలు సమర్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే పూర్తి వివరాలతో నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించింది.
ఈ సందర్భంగా ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థ భవనాలపై గతంలో జారీ చేసిన స్టేటస్ కో ఉత్తర్వులను హైకోర్టు ఉపసంహరించుకుంది. సల్కం చెరువు ఆక్రమణల కేసులో తదుపరి విచారణను వాయిదా వేస్తూ, ఎఫ్‌టీఎల్ పరిమితులు ఎలా మారాయనే అంశంపై ప్రభుత్వం సమగ్ర వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది.
న్యాయవాది విజయ్ గోపాల్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై విచారణ చేపట్టిన జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ ధర్మాసనం, రెవెన్యూ మరియు నీటిపారుదల శాఖలు సమర్పించిన సంయుక్త నివేదికను పరిశీలించింది. గత పహాణీల్లో సల్కం చెరువు విస్తీర్ణం 39 ఎకరాలుగా నమోదై ఉండగా, 2016లో జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్ తర్వాత కూడా ఇప్పటివరకు తుది నోటిఫికేషన్ ఎందుకు వెలువడలేదని కోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది.